ఏ డౌట్ వచ్చిన ఇప్పుడు గూగుల్ ఇతర సోషల్ మీడియాలను సంప్రదించేవారి సంఖ్య పెరిగిపోతోంది.. గూగుల్‌లో మ్యాటర్ మాత్రమే దొరుకుతుంది.. అదే యూట్యాబ్ అయితే కళ్లకు కట్టినట్టు వీడియోల రూపంలో చూపిస్తోంది.. దీంతో.. ఎంతో మంది యూట్యాబ్‌లో వీడియోలు చూస్తూ తమ పనులు చేసుకుంటున్నారు.. వంటలు నేర్చుకుంటున్నారు, వైద్యం చేసుకుంటున్నారు, ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా తెచ్చుకుంటున్నారు.. తాజాగా, ఓ వ్యక్తి దొంగతనం చేయడం ఎలాగో యూట్యూబ్‌లో చూశాడట.. దాని ప్రకారం.. చోరీకి స్కెచ్ వేశాడు.. చేసిన అప్పులు తీర్చలేక.. యూట్యూబ్ చూసి ఈజీగా చోరీ చేసి.. ఆ అప్పులు కట్టేయలనుకున్నాడేమో.. కానీ, ప్లాన్ విఫలమైంది.. కొత్త కష్టాలు తెచ్చుకుని.. ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది.
Read Also: Mother: చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్‌పల్లి మండలం వేంపేటలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. చేసిన అప్పులు చెల్లించడానికి యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించి చోరీకి యత్నించడం విశేషం. ఈ ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించారు సీఐ శ్రీను, ఎస్సైలు సధాకర్, రామచంద్రం.. వారు చెబుతున్న విషయాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన చెరకు రాజేశ్(35) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రూ.12 లక్షల వరకు అప్పుచేసి ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు.. అయితే, సక్రమంగా నడపక అప్పుల్లో కూరుకుపోయాడు.. అప్పులు తీర్చలేకపోయాడు. అప్పులు ఇచ్చినవారు ఇంటికి వచ్చి గొడలు చేస్తుండడంతో.. 15 రోజుల క్రితం మెట్పల్లికి మకాం మార్చాడు.. అంతేకాదు, దొంగతనం చేసి అప్పులు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో ఏటీఎం దొంగతనం చేసే వీడియోలను చూశాడు.. అదే రీతిన ఏటీఎంలో డబ్బులు దొంగిలించాలని స్కెచ్ వేశాడు.. మెట్‌పల్లి ఎస్‌బీఐ, వేంపేటలోని కెనరా బ్యాంకు ఏటీఎంలను ఎంపిక చేసుకొని భార్య ఏటీఎం కార్డుతో రెక్కి చేశాడు.. ఇక, చోరీకి అవసరమైన ఇతర వస్తువులను కూడా దొంగిలించాడు.. గత నెల 27న రాత్రి మెట్‌పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో గల వెల్డింగ్ వర్క్‌షాపులో పెద్ద గ్యాస్ సిలిండర్, నాజల్‌ను ఎత్తుకెళ్లాడు.. 30న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించినా గ్యాస్ సిలిండర్ పనిచేయక పోవడంతో చేసేది ఏమీలేక వెనుదిరిగాడు.. ఇక, ఈ నెల 1వ తేదీన వేంపేటలో కెనరా బ్యాంకు ఏటీఎంకు చేరుకుని ముందు తలుపును పగులగొట్టాడు. రెండో తలుపును గ్యాస్‌తో కోయడానికి యత్నించినా అది తెరుచుకోలేదు.. ఇక, దొంగతనాన్ని విరమించుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.. ఇక, శుక్రవారం మరో గ్రామానికి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా దొంగతనానికి ఉపయోగించిన వాహనం, పరికరాలతో పోలీసులకు చిక్కాడు రాజేష్.. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. అసలు విషయం మొత్తం బయటపెట్టాడు.