మహబూబాబాద్ జిల్లాలో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. పక్కింటి కోళ్లు.. ఇంట్లోకి వచ్చాయంటూ ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. ఏకంగా ఓ వృద్ధుడి రెండు కాళ్లను గొడ్డలితో నరికేశాడు. దీంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో విలవిలాడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూధనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: TS Inter Exams 2025: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఎంట్రీ!
కొండ సోమయ్య (60) అనే వృద్ధుడు సూధనపల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతడు నాటుకోళ్లు పెంచుకుంటున్నాడు. అయితే కోళ్లు మేత కోసం రోడ్లపై తిరుగుతున్నాయి. తరచుగా కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని పక్కనే ఉన్న మేకల లింగన్న ఇంటి వారు గొడవ పెట్టుకున్నారు. ఈ విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. పదే పదే కోళ్లు ఇంట్లోకి రావడంతో మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన లింగన్న… సోమయ్యకు చెందిన పిల్లల కోడిని చంపి.. గొడ్డలితో అతడి రెండు కాళ్లు నరికేశాడు. ఒక కాలు పూర్తిగా తెగిపోగా.. మరో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేకల లింగన్నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: MLC Elections 2025: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్..! వైఫల్యం ఎక్కడ జరిగింది..?