తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి మొదలుకానున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.
ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. 8.45 గంటల వరకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 9.05 గంటల వరకు విద్యార్థులను లోనికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలోనికి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేయనున్నారు. పరీక్ష సమయంలో ఎగ్జామ్ సెంటర్ దగ్గర్లో ఉన్న జీరాక్స్ సెంటర్ల మూసివేయాల్సి ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం ఉంటుంది.