Madhu Yaskhi : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబానికి ‘ఏటీఎం’గా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారని గుర్తుచేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా ఇప్పటికీ అది ప్రారంభం కాలేదని ఆయన ఆరోపించారు.
“ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట సీబీఐ, ఈడీలు వచ్చేవి. కానీ ఇక్కడ కేసీఆర్‌పై అసెంబ్లీలో విచారణకు ఆదేశించినా కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు?” అని మధు యాష్కీ ప్రశ్నించారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల తర్వాత కవితకు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని, జైలుకు పోయి వచ్చిన ఆమె నీతులు చెప్పడం, అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
CAG Report: 10 ఏళ్లలో భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే..?
“పదేళ్లు బడుగులను దోచిన కవిత… ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం ఏంటి?” అని యాష్కీ ప్రశ్నించారు. కవిత వ్యవహారం చూస్తుంటే కేసీఆర్ రచించిన నాటకం నుండి బయటకు వస్తున్నట్టు ఉందని, కేసీఆర్ రచించిన ‘కవిత’లో కవిత ఓ భాగమని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్‌గానే ఉంటారని, తప్పితే వెనకాల ఉండి చేయడం ఆయనకు అలవాటు లేదని చెప్పారు. కవిత వెనకాల సీఎం ఉన్నాడనేది చవకబారు ప్రచారమేనని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉంటాయని యాష్కీ ధీమా వ్యక్తం చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే ఏం చెప్పాలి అనే దానికోసం కేసీఆర్ కుటుంబం డ్రామా చేస్తుందా?” అని ప్రశ్నించారు. కవితపై నేరుగా ఆరోపణలు చేస్తూ, హిమాయత్‌నగర్‌లో ఉన్న విమలక్క ఆఫీస్‌ను ఖాళీ చేయించిందని, ఎక్కడా రెంట్ ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. కవితకు పోటీగా బతుకమ్మ పెట్టిందని కక్ష సాధించిందని, అలాంటి కవిత ఇప్పుడు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుందని విమర్శించారు.
ఎంపీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో డబ్బులు దండుకున్నదని, 10 మందికి శిక్షణ ఇచ్చి 100 మంది డబ్బులు దోచుకుందని యాష్కీ ఆరోపించారు. రైతుల కుటుంబాలను ఆదుకుంటాం అని డబ్బులు వసూలు చేసి వెనకేసుకుందని, హీరో నాగార్జున లాంటి వాళ్ల నుండి కూడా డబ్బులు వసూలు చేసి రైతులకు ఇస్తా అన్నదని చెప్పారు.
భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ… ఎన్‌డీఏ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని యాష్కీ అంచనా వేశారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం కోసం కేసీఆర్‌ను రక్షించే కుట్రను బీజేపీ చేస్తుందని, అందుకే సీబీఐ విచారణను ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. “విచారణ చేసి కూడా కేసీఆర్ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం కూడా జరగొచ్చు” అని ఆయన హెచ్చరించారు. కేటీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించిన యాష్కీ.. “కేటీఆర్… సీఎం రమేష్‌ను కలవలేదు అని చెప్పలేదు. చర్చ చేయలేదు అని కూడా చెప్పడం లేదు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ నుండి ఇంకా స్పందన రావాల్సి ఉంది.
Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..