వరంగల్ జిల్లా జనగామ వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అనే మాటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఎటువంటి కీలక పాత్ర లేకపోయినా, కేవలం గౌరవంతో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, కానీ ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ద్రోహం చేసి రేవంత్ రెడ్డి చెంతకు చేరారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనకు కనీస భౌగోళిక అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరిపై ఉందో, కృష్ణాపై ఉందో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, బక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియనివాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల పాలనలో సిగ్గులేని మాటలు, రోత కోతలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
LG మరో మ్యాజిక్..! గోడకు అతుక్కుపోయే Wallpaper TV.. 9mm మందం.. 4 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్.!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఉరితీయాలని అనడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి వేస్తావా?” అని ప్రశ్నిస్తూ, 70 లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరితీయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఒక లీడర్ కాదని, కేవలం ‘రీడర్’ అని, ఇక్కడి నాయకులు ఏమి రాసిస్తే అది చదవడమే ఆయన పని అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్లను తొక్కేసి, అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో , బయటా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
చివరకు తన గన్‌మెన్‌పై కూడా చేయి చేసుకునే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారని, ఆయన పరిస్థితి చూస్తుంటే పిచ్చి పట్టినట్లు ఉందని, రేవంత్ రెడ్డి భార్య గీతమ్మ ఆయన్ను కట్టేయాలని, లేకపోతే ఎవరినైనా కరిచే ప్రమాదం ఉందని సెటైర్లు వేశారు. తాను చదువుకున్న వ్యక్తిని అని, రేవంత్ రెడ్డి హవాలా తిరుగుడు తిరిగిన వ్యక్తని ఎద్దేవా చేస్తూ, భవిష్యత్తులో ఆయన మనవడు కూడా ఆయన్ను దేకడని శాపనార్థాలు పెట్టారు.
కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారే ఇంతకంటే ఎక్కువ మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారని, రేవంత్ పరిస్థితి కూడా అంతేనని హెచ్చరించారు. ప్రస్తుతం అసెంబ్లీ గౌరవ సభలా లేదని, కౌరవ సభలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ జనగామ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!