ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కు ఇంకా 14 రోజులు మాత్రమే సమయం ఉంది.. కార్యకర్తలు, నాయకులు బాగా కష్టపడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి 17 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ, అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు అందచేస్తామని చెప్పారు.
కళ్ళు బొల్లి కబుర్లు చెపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలియదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వారు కట్టిన ప్రాజెక్టులు చూడలేదు కానీ.. ఏసీ బస్సులో కూర్చుని కళ్ళ బొల్లు కబుర్లు చెపుతున్నాడని దుయ్యబట్టారు. మళ్ళీ ఉద్యమం చేసి ఎవరిని ఉద్ధరించడానికి, కేవలం దాచుకొన్నది ఉంచుకోవడానికి మాత్రమేనని ఆరోపించారు. మరోవైపు ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. వేసిన డ్రెస్ వేయకుండా విదేశాల్లో తిరుగుతూ.. ప్రజలను మోసం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని చేస్తాం.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.