కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. నీ భాగోతం బయట పెడుతా అన్నారు. కమిషన్లు ముడితే చాలు.. ఆ తర్వాత గంగుల కనిపించడని ఆరోపించారు. కరీంనగర్ లో జరిగిన ప్రతీ కుంభకోణం వెనక గంగుల పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
READ MORE: IND vs ENG: ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు నేటి మ్యాచ్ లో ఆడడం అనుమానమే!
“బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ నగర అభివృద్ధి జరిగింది. వినోద్‌ను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నేనే చెప్పాను. పోటీ చేస్తే బండి సంజయ్‌ను తట్టుకోలేవని చెప్పాను. బ్యాంకాక్, శ్రీలంకలో పత్తాలాడే సంస్కృతి గంగులది. డ్రైనేజీ నీళ్ళు మళ్ళించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పేరిట 200 కోట్లు వృథా చేశారు.
నగర అభివృద్ధి ఆగిపోవద్దని నేను ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నా. చెక్ డ్యామ్‌లు, రోడ్ల కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే. నాకు మేయర్ పదవి రాకుండా గంగుల ఆనాడే అడ్డు పడ్డాడు. కేంద్ర నిధులతోనే నగరం అభివృద్ధి సాధ్యమైంది. నాపై ఏ విచారణకైనా సిద్ధం. నీ అవినీతి బరాబర్ బయట పెడుతా.. చెంచాగాళ్ళతో ఫేస్ బుక్ పోస్టులు పెట్టడం కాదు.. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తాం. మరి కొంతమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారు.” అని మేయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.