సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వం చేసే మంచి పనులను పొగుడుతూ ఉంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను బహిరంగంగానే పొగిడారు.
ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎంను పొగడక తప్పట్లేదు అంటూనే ప్రశంసలు కురిపించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ రావడానికి సీఎం సహకారం చాలా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ వచ్చి ఆస్పత్రి ప్రారంభించాలని… ఏ పార్టీ అయిన పని జరగాలంటే అందరి సహకారం కావాలని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ని మెడికల్ కాలేజీ కోసం ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ అడిగానని… దీనిపై సీఎం అనుకూలంగా స్పందించారని.. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం వల్ల చుట్టుపక్కల పేద వారికి వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు దొరుకుతాయి అన్నారు. గాంధీ, ఉస్మానియా కి ధీటుగా ఈ కాలేజీ ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. పార్టీకి రాజీనామా చేసి సంగారెడ్డి నుంచి పోటీ చేస్తానని… కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థిని పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో కాస్త మెత్తపడ్డారు.
తనకు సోనియా, రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించాలని, పార్టీలో జరిగే పరిణామాల గురించి అధిష్టానానికి వివరిస్తా అని అన్నారు. దీంతో ఇటీవల రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి కుటుంబం ప్రత్యేకంగా సమావేశం అయింది. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి వివాదం సమసిపోయింది. ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలని రాహుల్ సూచించినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఇటీవల వరంగల్ కేంద్రంగా జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు జగ్గారెడ్డి ముందుండి వ్యవహరించారు. ఉమ్మడి మెదక్ నుంచి భారీగా జనసమీకరణ చేశారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయ్యేందుకు సహకరించారు.