వరి సేద్యం పై ఆంక్షలు విధించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు వారి ప్రాథమిక బాధ్యతను విస్మరించాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దు.. పామాయిల్ పంట వేసుకోమ్మంటాడని, పామాయిల్ లాంగ్ టర్మ్ పంట అని ఆయన అన్నారు. వరి రైతు లకు మద్దతుగా కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఖరీఫ్ పంట ధాన్యం గురించి మాట్లాడకుండా.. రబీ గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బియ్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్న ఎందుకు చేయడం లేదని ఆయన విమర్శించారు.
అనంతరం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రోజుల కొద్దీ వరి రైతులు కల్లాల్లో ఉండటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతు న్నార న్నారు. వరి తప్ప మరో పంట పండని భూమిల్ని రైతు ఏం చేయాలో కేసీఆర్ చెప్పాలన్నారు. ఇప్పుడు పండిన వడ్లు కొనుగోలు చేయడం పక్కన పెట్టి ఎండాకాలం వడ్ల కొనుగోలుపై కేసీఆర్ మాట్లాడుతు న్నారన్నారు. కల్లాలలో వడ్లు మొలకలెత్తుతున్నా యన్నారు. కేసీఆర్ కేంద్రం పై యుద్ధం చేసే ముందు.. వర్షాకాల వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్రం పై యుద్ధం ప్రకటించి.. చాలా సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. భూములను కార్పోరేట్ శక్తులకు అప్పగించే కుట్ర కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంకా ఆలస్యం చేస్తే అది ప్రభుత్వానికే మంచిది కాదని భట్టి హెచ్చరించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం రైతులకు మద్ధతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసింది మొదటగా కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుచేశారు. గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమో అన్న లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ధాన్యం తరలించే ట్రాన్స్ పోర్ట్ టెండర్ల పక్రియ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. నిల్వ సామర్థ్యం సరిపోయేంత లేదు.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు. షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము చెప్పిన పంటలనే వేయాలని ప్రభుత్వాలు రైతులను బెదిరిస్తున్నాయని శ్రీధర్ బాబు అన్నారు.