CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఈరోజు (ఫిబ్రవరి 15) పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యనటలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణు గోపాల్ తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
Read Also: Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్
ఇక, నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, ఇటీవలి ఢిల్లీ పర్యటనలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చినట్లు మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం వెల్లడించారు. తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లడంతో.. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.