సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి… విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపారు. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని… ఆ ట్రాప్‌లో పడితే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు. ఇవాళ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని… జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
Read Also: Telangana Liberation Celebrations: నేడు పరేడ్ గ్రౌండ్ లో విమోచన ఉత్సవాలు.. హాజరుకానున్న షా
విమోచన దినోత్సవం పేరుతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఇవాళ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కేంద్రబలగాలు కవాతు చేయనున్నాయి. ఇక, టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో ఏడాది పాటు వజ్రోత్సవ వేడుకలు జరపనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపునిస్తోంది కాంగ్రెస్. దానికి సంబంధించిన ఫొటోలను ఇవాళ విడుదల చేయనుంది. పార్టీ అధికారంలోకి వస్తే అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని ప్రచారం చేయనుంది కాంగ్రెస్. మరోవైపు.. తెలంగాణ సాయధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు… పోరాటంలో బీజేపీ, కాంగ్రెస్ లేవని చాటిచెప్పేలా కార్యక్రమాలు రూపొందించారు. ఊరూరా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు..
అయితే, 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగింది? అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది.. ఆ నాటి ఘటనలకు ఏడున్నర దశాబ్దాలు కావోస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటితరం.. అప్పుడు ఏం జరిగింది అనేదానిపై ఆసక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.. 1948 సెప్టెంబర్ 11న యూనియన్ సైన్యం.. హైదరాబాద్ సంస్థానంపై “పొలీసు ఆపరేషన్” పేరుతో జోక్యం చేసుకుంది. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను రక్షించింది. కానీ.. వెట్టిభాకం రద్దు చేసిన కమ్యూనిస్టులపై ఆపరేషన్ కొనసాగింది. 4వేల మంది కమ్యూనిస్టులను చంపారు. వేలాది మందిని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీన చేస్తున్నామని ప్రకటించారు. అయితే, ముస్లిం పరిపాలన నుంచి హిందువులకు విముక్తి లభించిందని కొన్ని పార్టీలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి..
కానీ, నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేశారు. కానీ, బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్.. అందుకే సెప్టెంబర్17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా.. అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారని ఆయన గుర్తుచేశారు.. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్వాతే సర్దార్ పటేల్ సైన్యం ప్రవేశించడం, నిజాం లొంగిపోవడం, అదే నిజాంను రాజ్ ప్రముఖ్‌గా నియమించడం జరిగాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. తెలంగాణలోని భూస్వాములు మళ్లీ భూములను స్వాధీనం చేసుకుంటే వాటిని దక్కించుకోవడానికి పోరాడిన ప్రజలను భారత సైన్యం మట్టుబెట్టాయి. ఇండియన్ యూనియన్‌లో విలీనం కోసం నిజాం, భూస్వాముల నిరంకుశత్వం నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రజలపై భారత సైన్యం తుపాకులు ఎక్కుపెట్టి నాలుగు వేల మందిని చంపాయి. కానీ.. ఈ ఉద్యమాన్ని హిందూ, ముస్లిం గొడవగా చూపించడం ఏమాత్రం సరికాదంటున్నారు.