రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్‌లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి చరిత్ర నిర్మాతలు ప్రజలేనని నిరూపించారన్నారు. హుజురాబాద్ యావత్ దేశానికి రాష్ర్టానికి దిక్సూచి అని దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. ఒకప్పుడు నాయకుడు అంటే త్యాగమని.. కానీ నేడు నాయకుడు అంటే వ్యాపారం అనే భావనకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు.
25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రజల ప్రేమను చూసినవాడిని. ఉద్యమంలో ఎలా ప్రజలు కొట్లాడమని ముందుకు నడిపించారని, ఇప్పుడు కూడా అలానే కొట్లాడుతానని ఆయన అన్నారు. కేసీఆర్ కొనసాగడం ప్రజాస్వామ్యానికే అరిష్టం అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఏం చేసినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్పు తథ్యం అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే వారు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారన్నారు. యాంటి డిఫెక్షన్ లా ను అపహస్యం చేసిన వాడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
అప్పుడు టీడీపీనీ, ఇప్పుడు 119 లో 90 మంది గెలిచినా కూడా కాంగ్రెస్ ను విలీనం చేసుకున్నాడని దుయ్యబట్టారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? నమ్మకాన్ని అమ్ముకుంటున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపికి మంచి అవకాశం ఉంది. పార్టీ మారిన నాయకులందరినీ వెనక్కు పిలవండి. ప్రజలకు విశ్వాసం కల్పించాలని, టీఆర్‌ఎస్‌ను నిలువరించి బొందపెట్టే పార్టీ ఒక్క బీజేపీనేనని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని, కేంద్రంలో కనుచూపు మేరలో వేరే ఏ పార్టీ పోటీలో లేదని ఈటల అన్నారు.