కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి కాంగ్రెస్‌కు పట్టడం లేదని, పదవుల కోసం, వాటాల కోసం మాత్రమే ఆ పార్టీ నేతలు పోరాడుతున్నారని అన్నారు. ప్రజలకు మళ్లీ మేలు జరగాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వడ్డెర సమాజం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఈ సమాజానికి అనేక రకాలుగా సహాయం చేసింది. సిద్దిపేటలో వడ్డెరల కోసం ట్రాక్టర్లు అందించాం,” అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోందని వడ్డెర సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. “కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాదులో బిల్డింగులు నిర్మించే పనుల్లో వడ్డెరలకు పని దొరికేది, చేతినిండా ఆదాయం ఉండేది,” అని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాదులో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే, “రేవంత్ రెడ్డి ఆ ఇళ్లను కూలగొట్టించాడు,” అని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చకుండా ఉండాలంటే, హైదరాబాదు అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. “రేవంత్ రెడ్డి ప్రజల ఇళ్లు కూల్చినా, ప్రజలే తనకు ఓటు వేశారంటూ విర్రవీగుతున్నాడు,” అని అన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీతో గ్యారంటీ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు వాగ్దానాలు నెరవేర్చలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. “రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేల చేస్తామన్న మాట నిలబెట్టారా? కేసీఆర్ కాలంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000కి పెంచాం. కానీ ఇప్పుడు వృద్ధులకూ రూ.4000 ఇవ్వలేదు, మహిళలకు రూ.2500 కూడా ఇవ్వలేదు,” అని ఆయన ప్రశ్నించారు. “జూబ్లీహిల్స్‌లో ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. డబ్బు మూటలతో, గుండాలతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డిని ఓటుతో శిక్షించాలి,” అని పిలుపునిచ్చారు.