హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోవాలన్న ఆయన.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో లేడా? మీది కుటుంబ పార్టీ కాదా? పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారాన్ని పంచుకోలేదా? అది కుటుంబ పార్టీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గు చేటని, మీ ఎత్తులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటూ మాటలు మార్చేస్తారని హరీశ్ రావు మండిపడ్డారు.
తాము తెలంగాణలో అధికారం లాక్కోలేదని, ఇది తమకు ప్రజలిచ్చిన అధికారమని హరీశ్ అన్నారు. మోదీ తెలంగాణకు వచ్చి వరాలు ప్రకటిస్తారని అనుకుంటే.. నిరాశే మిగిల్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ మాట్లాడుతున్నారని, అది వారి పగటి కల అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల గురించి ఆలోచించేది కేవలం కేసీఆర్ మాత్రమేనని.. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని తేల్చి చెప్పారు. ‘‘తల్లిని చంపి బిడ్డను బతికించారన్నారు.. తెలంగాణ ఆత్మాభిమానాన్ని పార్లమెంట్‌లో దెబ్బ తీసింది మోడీ’’ అంటూ హరీశ్ రావు ఆగ్రహావేశాలకు గురయ్యారు.