Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా? మరి మన రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
అదే విధంగా, “గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయిస్తారు, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వరు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, వాటిలో ఒక్కటినీ తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం పక్షపాతం కాకపోతే మరేం?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. “కేంద్ర బడ్జెట్‌లో కూడా తెలంగాణను పూర్తిగా విస్మరించారు. ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తూ, తెలంగాణకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం న్యాయమా?” అని కేంద్రాన్ని నిలదీశారు.
SBI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు రెడీ.. భారీ వేతనం..
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా హరీష్ రావు మండిపడ్డారు. “రేవంత్ సర్కారుకు ప్రజల సమస్యలపై ద్యాసే లేదు. ధరలు పెంచటం, పన్నులు వసూలు చేయటం తప్ప మరేం చేయడం లేదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రజినీకాంత్ లా మాట్లాడుతాడు, కానీ ఎన్నికల తర్వాత గజినీకాంత్ లా మారిపోతాడు” అంటూ విమర్శించారు. “రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నాడు” అని అన్నారు.
“బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులారా… తస్మాత్ జాగ్రత్త!. కాలం మారుతుంది. రేపు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం” అని హెచ్చరించారు. “బీజేపీకి ఓటు వేసినందుకే తెలంగాణ రైతులకు నష్టం కలిగింది. ఒక్కో రైతు సగటున రూ.7 వేల మేర నష్టపోయారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పుడు మాత్రమే కేంద్రం నుండి తెలంగాణకు నిధులు వచ్చాయి. ఇప్పుడు ఆ నిధులు ఆగిపోయాయి” అని అన్నారు.
“వచ్చేది వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ భూమి బీఆర్ఎస్‌ను మళ్లీ కోరుకుంటోంది. కేఎస్ఆర్ అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు మరచిపోలేదు. ఈసారి ప్రజల తీర్పు మరింత ఘనంగా ఉంటుంది” అని ధైర్యంగా ప్రకటించారు.