కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద ఇలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణలో కమలా సొసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందన్న హరీష్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు హరీష్‌రావు.
కమలా సొసైటీకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, రెడ్ క్రాస్ సొసైటీ, కమలాసొసైటీ వంటి సంస్థలతో మరో మారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇంకా తలసేమియా అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి నివారణపై దృష్టి సారించాలని, తెలంగాణ తలసేమియా రహిత రాష్ట్రంగా, దేశంలో తలసేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామని హరీష్‌రావు వెల్లడించారు.