జూబ్లీ హిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన పై ఆరా తీశారు. పూర్తి నివేదికను అందజేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రెండురోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ రోడ్ లోని అమ్నీషియా పబ్‌లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ఒక బృందం వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లే. వారిలో ఒక బాలిక పబ్‌లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. వారిలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. వారు బాలికను రెడ్ బెంజి కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు.
అక్కడ అరగంటపాటు సరదాగా గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో అయిదుగురు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన అయిదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలిని అమ్నీషియా పబ్ వద్ద దింపేసి వెళ్లారు.