Talasani Srinivas Yadav: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు దసరాకు ఒకరోజు ముందే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీపికబురు అందించారు. ప్రస్తుతం గోపాల మిత్రలకు నెలకు రూ.8,500 చెల్లిస్తుండగా.. 30శాతం జీతం పెంచనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం అంటే రూ.2,550 పెంచి మొత్తం రూ.11,050 ఇస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు అందుబాటులో ఉంటూ పాడి గేదెలకు కృత్రిమ గర్బాధారణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, నట్టల నివారణ మందుల పంపిణీ వంటి కార్యక్రమాలలో గోపాలమిత్రలు సేవలు అందిస్తున్నారు.
Read Also: Uppala Srinivas Gupta: అఖిల భారత హిందూ మహాసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
జీతాల పెంపుతో తెలంగాణ వ్యాప్తంగా 1,530 మంది గోపాలమిత్రలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు గోపాలమిత్రలకు రూ.3,500గా ఉన్న జీతాన్ని సీఎం కేసీఆర్ ఒకేసారి రూ.8,500లకు పెంచారని మంత్రి తలసాని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో గోపాలమిత్రలకు పారితోషికం ఇవ్వడం లేదన్నారు. అటు గోపాలమిత్రల నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించే విధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తెలంగాణా వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. మరోవైపు విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో గోపాలమిత్రలు పాడి రైతులతో నేరుగా సంప్రదింపులు చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ పెరిగిందని పేర్కొన్నారు.