యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాతో మనందరికీ ‘కార్తీక్’గా సుపరిచితుడైన నటుడు సుశాంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్ర సీక్వెల్ ‘ENE Repeate’ నుండి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా, నటనకు కూడా దూరమవ్వాలనే సంకేతాలు ఇస్తూ ఆయన షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Mahesh Babu: ‘నా సర్వస్వం నువ్వే’.. భార్యపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
“ఈ నగరానికి ఏమైంది చిత్రం నా గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నటుడిగా కొనసాగాలనే నా ప్రయాణంలో విధి నన్ను వెక్కిరించింది” అంటూ సుశాంత్ తన ఆవేదనను పంచుకున్నారు. సినిమా విడుదలై 8 ఏళ్లు గడుస్తున్న తరుణంలో, వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన సినిమా జీవితానికి మధ్య సమతుల్యం కుదరకపోవడం వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నటనపై ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ‘కార్తీక్’ పాత్ర నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అయితే, తన స్థానంలో రాబోయే కొత్త కార్తీక్ ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ, తరుణ్ భాస్కర్ టేకింగ్ పై తనకు అపారమైన నమ్మకం ఉందని తెలిపారు. “నేను మీ ప్రేమను, సెట్ లో ఉండే సందడిని చాలా మిస్ అవుతాను. కానీ, ఒక ప్రేక్షకుడిగా మీతో పాటు థియేటర్లో ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తాను” అని ఆయన ముగించారు. ఆ నలుగురు స్నేహితుల బంధాన్ని మళ్ళీ వెండితెరపై చూడాలనుకున్న అభిమానులకు సుశాంత్ తప్పుకోవడం నిజంగా తీరని లోటే అని చెప్పాలి.