హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి తగిన శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా పరిస్థితి ఇంతేనని పట్టించుకునే నాథుడు కరువయ్యాడని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
నల్లకుంట తిలక నగర్ వద్ద వర్షానికి భారీ వృక్షం నేలమట్టమైంది. వృక్షం నేలమట్టం కావడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి అక్కడ నుండి చెట్టును తొలగించాలి బస్తీ వాసుల డిమాండ్ చేస్తున్నారు. రసూల్పూరలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ లోపలికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో కారు, టూవీలర్లతో పాటు సెల్లార్లో నివాసముంటున్న సెక్యూరిటీ ఇంట్లోని సామాన్లు నీట మునిగాయి.
చిలకగూడలో రోడ్డు పై పడిపోయిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్ల పైకి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు చేరుకున్నారు. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇవేకాకుండా.. అత్తాపూర్ పోలీస్ ఔట్ పోస్ట్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో సీలింగ్ కూలిపోయింది. సిబ్బంది నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్ బస్తీరి ఆనుకొని నిర్మిస్తున్న భవనం, గోవా కర్రలు కురిసిన భారీ వర్షానికి ఒక్క సారిగా కుప్ప కూలాయి. దీంతో బస్తీలో సుమారు 20 కి పైగా నివాసాలపై కప్పులు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో కరెంటు తీగలు కూడా తెగిపోవడంతో బస్తీ కి కరెంటు సరఫరా నిలిచిపోయింది. వీఎస్టీ సమీపంలోని నాగమయ్య కుంటలో ఇండ్ల పై భారీ వృక్షం కూలింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 5 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది