Fake Organic Fertilizers In Yadadri Bhongir District: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ ఆర్గానిక్ ఎరువుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో ఆర్గానికి ఎరువులని చెప్పి.. రైతుల (30-40 మంది) నుంచి అక్షరాల రూ. 3 లక్షలు దోచేశారు. ఆదిత్య ఆర్గానిక్ పేరుతో ఓ నకిలీ ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. తమ దగ్గరున్న ఎరువులు కిసాన్ గోల్డ్ మ్యానుఫ్యాక్టర్‌వి అని నమ్మించి, ఈకో టెక్నాలజీతో జీఎస్టీ లేకుండా బిల్లులు వేశారు. నకిలీ ఎరువుల బస్తాపై రూ. 1200 ఎమ్మార్పీ ఉండగా, రైతులకు రూ. 1000 చొప్పున బస్తా ఇచ్చారు. మ్యానువల్ బిల్లులో మాత్రం బస్తాకు రూ. 500లే మెన్షన్ చేశారు.
ఆ లెక్కల గురించి పెద్దగా పట్టించుకోని రైతులు.. తమకు తక్కువ మొత్తంలోనే ఎరువులు లభిస్తున్నాయన్న ఆనందంతో ఆ ముఠా నుంచి ఏకంగా 340 బస్తాలు కొనుగోలు చేశారు. రైతులకి అనుమానం రాకముందే, అక్కడి నుంచి ఆ నకిలీ ముఠా చెక్కేసేందుకు ప్లాన్ చేసింది. అయితే.. ఇంతలోనే వీరి బండారం బయటపడింది. నీటిలో మందు వేయగానే, అది తేలియాడడంతో కల్తీ ఎరువులుగా రైతులకి అనుమానం వచ్చింది. దీంతో.. పారిపోతున్న నకిలీ ముఠా వాహనాన్ని ఆపి, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఈ వ్యవహారంపై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. విచారణ చేపట్టారు.