ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నట్లే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్‌లు జారీ అవుతాయని తెలిపారు. ఇకపై వివిధ శాఖలలో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయన్నారు. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయన్నారు. తద్వారా నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.