మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి అసైన్డ్ భూముల ఆరోపణలతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే.. ఇప్పటి పలుసార్లు సీఎ కేసీఆర్‌పై విరుచుకుపడ్డ ఈటల.. ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పైనే పోటీచేస్తానన్నారు. అంతేకాకుండా ఇప్పటికే గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.
గజ్వేల్‌లో వర్క్ స్టార్ చేశామని, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని… పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని ఈటల అన్నారు. నేను టీఆర్‌ఎస్‌లో చేరింది కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచేనని ఈటల రాజేందర్ వెల్లడించారు. అయితే.. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.