ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై తర్జనభర్జన పడిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపారు.. చివరకు భారతీయ జనతా పార్టీ వైపే ఆయన మొగ్గు చూపారు.. ఢిల్లీలో మకాం వేసి మరి.. తనకు ఉన్న అనుమానాలను నివృత్తిచేసుకునే పనిలో పడ్డారు.. తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకు సానుకూల పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. దీంతో..జూన్ 4వ తేదీ అంటే శుక్రవారం రోజు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు ఈటల. ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజేపిలో చేరనున్నారు ఈటల. అయితే బిజేపిలో చేరడానికి మరో వారం రోజులు పట్టనున్నట్లు సమాచారం.