తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. చెన్నూరుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మంథని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు. మంథని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ ఒకే కుటుంబానికి పరిమితమైపోయిందన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి వైపు ప్రజలందరూ మొగ్గు చూపాలన్నారు. అసెంబ్లీ వేదికగా మంథని రైతాంగం కోసం సాగు నీరు అందించాలని కోరాము.. కానీ లాభం లేకుండా పోయిందన్నారు. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇక్కడి ప్రజలకు నీరు అందించకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం బాధాకరమన్నారు.