సంక్రాంతి, పండుగలకే కాదు జల్సా రాయుళ్ళకు ప్రతిరోజూ పండగే. కాస్త టైం, ప్లేస్ ఫిక్స్ అయితే చాలు ఎన్ని లక్షలయినా ఖర్చుపెడతారు.. పేకాట ఆడతారు.. కోళ్ళ పందాలతో ఎంజాయ్ చేస్తారు. అదీ ఎవరూ లేని చోట అయితే.. వారి దూకుడుకు హద్దే వుండదు. తాజాగా పేకాటరాయుళ్ళ సరదా డ్రోన్ కెమేరాలు పట్టేశాయి. అటవీశాఖ వారు అడవుల సంరక్షణ కోసం డ్రోన్ కెమేరాలు వాడుతున్నారు. ఆ డ్రోన్ కెమేరాల కంటికి జల్సారాయుళ్ళు చిక్కుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కార్యకలాపాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ కి అతి సమీపంలో ఉండే నర్సాపూర్ అటవీ ప్రాంతం జల్సారాయుళ్లకు అడ్డాగా మారింది. హైదరాబాద్ కి చెందిన కొందరు బడావ్యక్తులు కోళ్లపందాలు, పేకాట ఆడుతున్నారని సమాచారం వచ్చింది. దీంతో అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామన్న ఆలోచన వచ్చింది. వెహికల్స్ వాడితే జల్సారాయుళ్ళు పారిపోతారు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా డ్రోన్ కెమేరాలను రంగంలోకి దింపారు అటవీ అధికారులు.. ఇంకేముంది అటవీ ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాలు బయటపడ్డాయి.
డ్రోన్ కెమెరాతో అడవి వీడియోలు తీస్తుంటే డ్రోన్ కెమెరా కంటపడ్డారు పందెం రాయుళ్లు. డ్రోన్ కెమెరాను చూసి పరుగులు పెట్టారు పందెం రాయుళ్లు. వీకెండ్స్ లో ఎక్కువగా ఇలాంటి దందా సాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.