సంకలో పిల్లాడ్ని పెట్టుకుని సంతంత వెతికరాట ఈసామెత విన్నారా.. ఓ నెక్లెస్ వ్యవహారంలో కూడా అచ్చం ఇలానే జరిగింది. నిన్న డైమెండ్ నెక్లెస్ పోయిందంటూ ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇంట్లోనే ఆ డైమండ్ నెక్లెస్ దొరకడంతో.. పోలీసులకు మాజీ రాజ్యసభ సభ్యుడు ఫోన్ చేసి చెప్పాడు. ఇక పోలీసులకు వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్లు హమ్మయ్య అంటూ ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక వివరాల్లో వెళితే..
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని మిథిలా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న కేవీపీ సతీమణి కోటగిరి సునీత ఈనెల 11న నోవాటెల్ హోటల్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు ఆభరణాలు ధరించి వెళ్లారు.
తిరిగి రాత్రి ఫంక్షన్ నుంచి వచ్చిన ఆమె ఆభరణాలను బెడ్‌రూమ్‌లో పెట్టారు. మరుసటి రోజు ఉదయం ఆభరణాలను మరో బెడ్‌రూమ్‌లో భద్రపర్చారు. కాగా, ఆదివారం ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు ఆభరణాలు చూడగా.. డైమండ్ నెక్లెస్ కనిపించలేదు. సుమారు రూ. 46.60లక్షల విలువైన 49.95 గ్రాముల నెక్లెస్ మాయమైనట్లు గుర్తించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇళ్లంతా మరోసారి జల్లెడ పట్టిన కేవీపీ కుటుంబ సభ్యులకు నెక్లెస్ దొరికింది. ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.