మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. పెట్రోలియం మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన ఈటల పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడగలేదెందుకు..? అని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఈటల తరం కాదు. కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నా.. తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడే కఠోర దీక్షతో పాలన సాగిస్తున్నారు. ఈటలకు రహస్య ఎజెండా ఉంది. ఈటల వెంట హుజురాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరూ వెళ్ళలేదు. కెసిఆర్ ను కాదని టీఆర్ఎస్ ను వీడిన వాళ్ళు రాజకీయంగా కనుమరుగయ్యారని వినయ్ భాస్కర్ విమర్శించారు.