తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణ ను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన దళిత మేధావులను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు.
read more : వైఎస్ పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదు : ఏపీ మంత్రి
సిఎం దళిత సాధికారత పథకాన్ని ప్రకటించి మొదటి దశలో 1200 కోట్ల రూపాయలను ప్రకటించినందుకు గాను., మరియమ్మ లాకప్ డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంచినందుకు గాను, దళిత మేధావులు ప్రొఫెసర్లు ప్రగతి భవన్ లో సోమవారం సిఎం కెసిఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సిఎం ను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేషన్ తదితర దళిత సంఘాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు మేధావులున్నారు.