గచ్చిబౌలిలో ఇటీవల చోటుచేసుకున్న ఒక బాలుడి విషాదాంతం అందరినీ కలచివేసింది. కేవలం స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక, చదువుల ఒత్తిడి భరించలేక ఆ చిన్నారి తీసుకున్న నిర్ణయం.. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కీలక సూచనలు చేస్తూ ఒక ప్రత్యేక అవగాహన కథనాన్ని విడుదల చేశారు.
ఇటీవల బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగింది. చదువుల ఒత్తిడితో ఇక జీవితంలో ఏమీ లేదననే రీతిలో విద్యార్థులు తమకు తాముగా మరణ శాసనం రాసుకుంటున్నారు. జీవితంలో పరీక్షలు అనేవి ఒక భాగం మాత్రమే అని.. పరీక్షలే జీవితం కాదు. కేవలం చదువే జీవితం కాదు. చదువు లేకున్నా విషయజ్ఞానాన్ని, హార్డ్ వర్క్, ప్యాషన్ ను నమ్మి ఎంతో మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. చెప్పులు కుడుతూ వీధి దీపాల కింద చదివి అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. జీవితంలో పెద్దగా చదువు లేనప్పటికీ పట్టుదల, కృషి ఉంటే గొప్పవారు కావచ్చని శ్రీనివాస రామానుజన్, రజనీకాంత్, నవాజుద్దీన్ సిద్దికీ, మార్క్ ట్వెయిన్, స్టీవ్ జాబ్స్, షేక్ స్పియర్, మైఖేల్ ఫారడే, గ్రెగర్ మెండల్, విన్ స్టన్ చర్చిల్, అబ్రహాం లింకన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తదితరులు నిరూపించారు.
ర్యాంకులు, మార్కులు, తోటి విద్యార్థులతో పోలికలు.. ఇవన్నీ కలగలిపి విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. బతకడం కోసం, విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు.. యువతను మానసిక ఒత్తిడికి గురిచేసి వారిని ఆత్మహత్యల వైపు నడిపిస్తుండడం బాధాకరం. ర్యాంకుల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దేశమంతటా వెలుగుచూస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు సామాజిక రుగ్మతగా పరిణమిస్తున్నాయి. చదువు మనిషిని సంస్కరించాలి.. చదువు జీవన వికాసానికి ఉపయోగపడాలి కానీ జీవన వినాశనానికి కాదు.
బౌన్స్ బ్యాక్..
జీవితంలోనైనా, ఆటలోనైనా గెలుపోటములు సహజం. ఓటమిని చూసి భయపదొడ్డు.. అధైర్యపడొద్దు, క్రుంగిపోవద్దు. ఆత్మన్యూనత భావానికి లోనూ కావద్దు. అపజయం నుంచి నేర్చుకొని బౌన్స్ బ్యాక్ కావాలి. Failures are stepping stones to success (వైఫల్యాలే రేపటి విజయానికి బంగారు బాటలు) చరిత్రలో గొప్పగొప్ప వాళ్లంతా ఓటమి రుచి చూసిన వారే. ఓటమి ఎన్నో గెలుపు పాఠాలను నేర్పుతుంది. తాము ఎక్కడ తప్పు చేస్తున్నామని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిక్కీమౌస్ క్యారెక్టర్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ, అబ్రహాం లింకన్, బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్, విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ , పర్వాతారోహకుడు టెంజింగ్ నార్గే తదితరులందరూ ఓటమిని ఒప్పుకోలేదు.. మళ్లీ మళ్లీ ప్రయత్నించి తాము అనుకున్న లక్షాలను సాధించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకువెళ్లాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించుకోవాలి. మనం ఎంచుకున్న రంగంలో ఎదివరకే విజయం సాధించిన వారి సూచనలు తీసుకోవాలి.
సైబరాబాద్ పోలీసుల సూచనలు..
మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే కూడా వారి జీవితం, వారి యొక్క జీవించే హక్కు, వారు జీవించి ఉండడం మీకు అత్యంత ప్రాధాన్యమైనదని మీరు గుర్తించండి.
ప్రెషర్ కుక్కర్ చదువులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తాయి. మార్కులు, ర్యాంకుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదటికే చేటు చేస్తుంది.
మార్కులు జీవితనైకి భవిష్యత్తు కి కొలమానం కాదని వారికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలి.
పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అన్ని దారులు మూసుకుపోయాయని అనుకోవద్దు. వివిధ రంగాల్లో తమదైన ముద్రా వేసి జీవితం లో పైకి ఎదిగిన వారు ఎన్నో రంగాల్లో ఉన్నారు. పిల్లల ఆసక్తిని బట్టి ప్రోత్సహించాలి.
పిల్లలు డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతే మంచి సైకాలజిస్ట్ ను సంప్రదించాలి.
విద్యాపరమైన లక్ష్యాలను సాధించలేకపోవడం అంటే మనిషి జీవించే అర్హతను కోల్పోవడం కాదని తెలపాలి.
స్వభావ సామర్థ్యాల్లో ఏ ఇద్దరూ విద్యార్థులు ఒకే విధంగా ఉండరన్న సత్యాన్ని గ్రహించి తరచూ ఇతరులతో పోల్చకుండా చూడాలి.
పిల్లల కోసం పెద్దలు రోజూ కొంత సమయం కేటాయించాలి. వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి.
విద్యార్థికి ఆసక్తి ఉన్న గ్రూప్ లలో నే జాయిన్ చేయడం ఉత్తమం.
పరిమిత అవకాశాలు, అసంఖ్యాక అభ్యర్థుల (Limited opportunities, Unlimited competitors) మధ్య కొనసాగే పోరులో విజయ సంభావ్యతకు సంబంధించిన అవగాహన కల్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కనీస బాధ్యత.
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేయడం, హోమ్ వర్క్, స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్, వీక్లీ టెస్ట్…ఇలా కోచింగ్ సెంటర్లలో క్షణం తీరిక లేకుండా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం మంచిది కాదు.
విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయట పడేందుకు వారిని వ్యాయామం, యోగా మెడిటేషన్ చేయమని ప్రోత్సహించాలి.
మోటివేషనల్ బుక్స్, గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలను చదివేలా ఎంకరేజ్ చేయాలి.
పరీక్షల రకాలు, వాటి స్వభావాలు, లక్ష్యాలు, ప్రణాళికల రూపకల్పనలతో పాటు జీవిత ప్రాధాన్యాన్ని వివరిస్తే, ఓటమిని సైతం గెలుపుగా మలచుకునే విశ్వాసం విద్యార్థుల్లో కలిగించాలి.