విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.
మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
చారిత్రక ప్రదేశాలను కమ్యూనిస్టులు ఎప్పుడూ సందర్శిస్తారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్ బాబాకు లేదు. సమానత్వం ఎక్కడ ఉందో రామ్ దేవ్ బాబా చెప్పాలి. రాందేవ్ బాబా దళిత వాడలు,గిరిజన వాడలను సందర్శించిన తరువాత సమానత్వం గురించి మాట్లాడాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని మండిపడ్డారు.
కేసీఆర్ విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని చెప్పడం సంతోషంగా వుందన్నారు. కేంద్రం 35వేల కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీని తగ్గించింది. బీజేపీని ఓడించేందుకే ప్రజల మద్దతు అవసరం వుందన్నారు. విభజన హామీలపై త్రిసభ్య కమిటీ వేయడానికి నరేంద్రమోదీకి ఏడేళ్లు పట్టింది. ఈ కమిటీ కంటి తుడుపు చర్యే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి శృంగ భంగం కలుగుతుంది. కర్ణాటకలో హిజాబ్ పేరుతో.. మత వివాదాన్ని సృష్టించింది.
యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ హిజాబ్ సమస్య ను తీసుకువచ్చిందని రాఘవులు విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో విభజన హామీలపై తీర్మానం చేసామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెతక వైఖరి అవలంభించారు. కేసీఆర్ కేకలు వేస్తున్నారు తప్పితే బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో చెప్పి మాట తప్పారన్నారు.
అమాయక గిరిజనుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. శాటిలైట్ ఫిక్చర్ ల ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మత సమస్య పేరుతో బీజేపీ ఆందోళనలు సృష్టిస్తుందన్నారు. తెలంగాణను అవమానించే అర్హత మోదీకి లేదు. టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకునే అర్హత బీజేపీ కి లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రాష్ట్రాల హక్కులను కేంద్రం హారిస్తోందని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.