మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్(35) గురువారం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనంపై తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తుండగా ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఒకరు తల్వార్.. మరొకరు గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చి అక్కడినించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రవినాయక్ మృతదేహాన్ని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. కాగా, హత్యకు పాల్పడ్డ ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా వుంటే మహబూబాబాద్ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ హత్యపై బంధువులు భగ్గుమంటున్నారు. ఈ హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ హస్తముందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బాబునాయక్ తండావాసులు జిల్లా ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హామీ ఇచ్చారు. రవినాయక్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డిలు వేర్వేరుగా జిల్లా ఆస్పత్రికి చేరుకుని రవినాయక్ మృతదేహాన్ని సందర్శించారు.
నిన్న హత్యకు గురైన కౌన్సిలర్ రవి నాయక్. మృతదేహానికి గురువారం రాత్రి ఏరియా హాస్పిటల్ లో పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం తర్వాత.. రవి నాయక్ మృతదేహాన్నీ కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య రవి నాయక్ మృతదేహాన్నీ స్వగ్రామానికి తరలించారు పోలీసులు. అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. హత్యకు గురైన రవి నాయక్ కి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కుటుంబసభ్యులు.
Read Also: Telangana Congress: ఇప్పటికీ మేల్కోకపోతే ఇక కష్టమే..!