150 ఏళ్ళ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపి అనంతరం దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఇప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది పోయి..రెండో రకం చిన్న పార్టీగా మారిపోయింది.
ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న లోపమే ఆ పార్టీని నాశనం చేస్తున్నదని చెప్పాలి. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. సీనియర్.. జూనియర్ రాజకీయం. వీటి కారణంగా ఆ పార్టీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. ముందు ఇంటిని సర్దుకోలేని పార్టీ రాష్ట్రంలో ఏమీ రాణిస్తుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ప్రస్తుతం బీజేపీ భర్తీ చేస్తున్నది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు పొందింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకున్నది. అనంతరం అధికార పార్టీ టీఆర్‌ఎస్ వేసిన వ్యూహంలో ఆ పార్టీ చిక్కిపోయింది. అనంతరం వరుస ఉప ఎన్నికల్లో.. ఆ తర్వాత 2018లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఏ ఎన్నికలు వచ్చినా నామమాత్రపు విజయాలు కూడా దక్కించుకోలేకపోతోంది. కనీసం డిపాజిట్ అయినా కాపాడుకోలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
వీటన్నింటికీ ప్రధాన కారణం పార్టీని గాడిన పెట్టే నాయకుడు లేకపోవడం. దీనికి తోడు నాయకుల స్వయంకృతాపరాధం ఉన్న ఇంటికి నిప్పు పెట్టుకున్న మాదిరి తయారైంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కదిద్దేందుకు జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించి.. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయినా కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఓ పదవి ఇచ్చి నోరు మూయించింది. మరికొందరికి కూడా అదే విధంగా చేసి పార్టీని చక్కదిద్దే బాధ్యత మొదలుపెట్టింది. రేవంత్‌రెడ్డి కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను వ్యతిరేకించే పెద్దలను పార్టీ అధిష్టానం ద్వారా నచ్చచెప్పిస్తుండగా.. మిగిలిన వారిని తనదైన మార్క్‌తో తనవైపునకు తిప్పేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు పార్టీ పగ్గాలు అప్పగించిన తన ప్రస్తుత రాజకీయ గురువు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని మరోసారి రాష్ట్రానికి తీసుకువస్తున్నారు రేవంత్. మే నెలలో రెండు రోజుల పాటు రాహుల్ పర్యటనతో పార్టీలో పరిస్థితులు సర్దుకుంటాయని తెలుస్తున్నది. ఈ మేరకు రేవంత్ వర్గం ఆ దిశన ప్రయత్నాలు చేస్తున్నది. వరంగల్ సభతో పార్టీ ఉనికిలో ఉందని ప్రజలకు చాటి చెప్పడంతో పాటు తామంతా ఐకమత్యంతో ఉన్నామని రుజువు చేసే ప్రయత్నం ఇది. ఇది విజయవంతమైతే కాంగ్రెస్‌లో జోష్ వచ్చినట్టే. ఇదే జోష్‌ను 2023 వరకు కొనసాగిస్తే అధికారంలోకి రాకపోవచ్చు గానీ ఇప్పటికైనా మెరుగైన పరిస్థితుల్లో మాత్రం పార్టీ ఉండవచ్చు.
రాష్ట్రంలో పార్టీకి ప్రధానంగా నాయకత్వ లోపం వెంటాడుతున్నది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేరు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుతో ఆ స్థానాల్లో నియోజకవర్గ స్థాయి నాయకుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఈ పనిని పూర్తి చేయాలి. టీడీపీ అస్తమయం కావడంతో ఆ పార్టీకి పటిష్టంగా ఉన్న ఓటుబ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవాల్సి ఉంది. ఈ బాధ్యతను రేవంత్ సునాయసంగా చేసుకోవచ్చు. అందుకే తన పార్టీ మాజీ నాయకులను అప్పుడప్పుడు కలుస్తున్నారు. వారందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలి. పార్టీలో చేరికలను పెంచాలి. ఇక సీనియర్లను రేవంత్‌రెడ్డి కలుపుకొని పోవాలి. జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి సోదరులు, మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి తదితర నాయకులతో సఖ్యత పెంచుకోవాలి. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే రేవంత్‌రెడ్డికి పార్టీలో తిరుగుండదు.
ఒక్కసారి పార్టీలో పట్టు సాధిస్తే ప్రజల్లోకి వెళితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. కమిటీలను నియమించాలి. నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. దీనికి 33 జిల్లాల్లో వరుసగా సభలు పెట్టాలి. ఇటీవల రేవంత్‌రెడ్డి పెట్టిన సభలు అద్భుతంగా కొనసాగాయి. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రేవంత్ సభ ఊహించని రీతిలో విజయవంతమైంది. దీంతో అధికార పార్టీలో కొంత వణుకు మొదలైంది.
ఇప్పటికైనా సమయం మించిపోలేదు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే హస్తం పార్టీ తెలంగాణలో కొంత మెరుగ్గానే ఉంది. పార్టీ నాయకత్వం కూడా దృష్టి సారిస్తే ఐసీయూలో ఉన్న పార్టీకి శస్త్రచికిత్స చేస్తే మళ్లీ పూర్వవైభవం సాధించే అవకాశం ఉంది. దీనికి కావాల్సినదల్లా నాయకులు ఐకమత్యంగా ఉండడం. గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టడం. ఇప్పుడు మేల్కోనకపోతే మళ్లీ పార్టీ తిరిగి పునరజ్జీవం పొందడం కష్టమే. ఇది గ్రహించి పార్టీ నాయకులంతా ఐక్యంగా ఉండి పార్టీ ముందుకు నడిపిస్తే 2023లో కొంత ప్రభావం చూపవచ్చు. దూకుడు పెంచితే దుమ్ము రేపవచ్చు.