తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ భూములను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారుల నుంచి తీసుకున్న డిపాజిట్ నుంచి 2 కోట్లతో రైతుల నుంచి 67 ఎకరాలు సేకరించిందని, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కలెక్టర్ అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు వివాదాలున్నా .. ఎలాంటి వివాదాలు లేవని కలెక్టర్ పత్రిక ప్రకటనలివ్వడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాల్టి నుంచి నిర్వహిస్తున్న రాజీవ్ స్వగృహ భూముల వేలం ప్రక్రియ వల్ల కొనుగోలు చేస్తే.. వాళ్లు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. కోర్టు వివాదాలు తొలిగిపోతే ఆ భూముల విలువ 1000 కోట్ల రూపాయలుంటుందని, ఈ భూమి నిజానికి ఆనాటి స్వగృహ లబ్ధిదారులకే చెందాలన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ భవిష్యత్తు అవసరాలకు భూమి లేకుండా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.