ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమ సమయంలో జవహర్ లాల్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారని ఆయన వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ తరపున 90 కోట్ల రూపాయలు చెల్లించిందని ఆయన అన్నారు. యంగ్ ఇండియా కంపెనీ ద్వారా ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. నేషనల్ హెరాల్డ్ కష్టాలలో ఉన్నప్పుడు 90 కోట్లు ఇచ్చి షేర్లు బదిలీ మాత్రమే చేసారని ఆయన తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ పేరుతో ఈడీ రాహుల్ గాంధీకి వరుసగా విచారణ పేరుతో బీజేపీ ప్రభుత్వం మానసికంగా ఒత్తిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని మానసింకంగా ఒత్తిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో జనతా సర్కార్ ఇందిరా గాంధీని మానసికంగా హింసించారని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని హింసిస్తోందని ఆయన అన్నారు. ఈడీ విచారణను ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.