తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వివిధ పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తుంటాయి. తాజాగా ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితితో కలిసి నడవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎలాగైనా మనుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్ తన సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చే పార్టీల వైపు కన్నేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.తమతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నాయి. అందులో భాగంగా టీజెఎస్ వారికి కనిపించింది. ఆ పార్టీ అధిరుత కోదండరాం తో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి కోదండరాంతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు కోదండరాంని కలిశాం అన్నారు మహేష్ గౌడ్. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికలపై చర్చ చేశాం…ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్దతు ఇవ్వాలని కోరాం.. కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కోదండరాం చెప్పారు.
టీఆర్ఎస్-బీజేపీ వ్యవహార శైలిపై చర్చ జరిగింది… రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం.. సిద్ధాంత పరంగా మాతో కలిసి వచ్చే పార్టీ లను కలుపుకుని పోతాం అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ ను ఓడించాలంటే తమకు మద్దతు పలకాలని మహేష్ గౌడ్ కోదండరాంని కలిసి కోరారు.
Read Also: Bihar Politics: ఏం చేద్దాం.. బీహార్ బీజేపీతో నడ్డా, అమిత్ షా భేటీ
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అన్న సంగతి తెలిసిందే. అయితే, మునుగోడులో మళ్ళీ గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, కాస్త కష్టమయినా గెలిచే సత్తా వుందని కాంగ్రెస్ భావిస్తోంది. మునుగోడులో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా, ఇక్కడ విజయం సొంతం చేసుకోవచ్చనే లెక్కలు వేసుకుంటోంది టీపీసీసీ. అయితే తక్కువ కాలం మాత్రమే పదవీకాలం వున్న వేళ కాంగ్రెస్ కు అంత బలమయిన వ్యక్తి ఎవరు దొరుకుతారనేది మిస్టరీగా మారింది. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం వుందని, అందులో భాగమే మునుగోడు ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇదిలా వుంటే.. కాంగ్రెస్ మద్దతు కోరిందని తెలిపారు కోదండరాం. పార్టీ లో చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే నియోజక వర్గం లో మేము పని చేస్తున్నాం. పార్టీలో చర్చ చేసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం అని చెప్పారు కోదండరాం.