ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలకలో కోమరబండలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్యాండ్, ల్యాండ్ మైన్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొమరబండను మున్సిపాలిటీ నుండి విముక్తి కలిగించి గ్రామ పంచాయతీగా ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికార బలంతో, మంది బలంతో అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమమైన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో రైతులే దేశానికి ముఖ్యం.. వరంగల్ లో ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ని ప్రతి గ్రామానికి చేరవేస్తామన్నారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అవినీతిపరులు ఉన్న రాష్ట్రంలో నీతి,నిజాయితీకి మారుపేరు సౌమ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆమె కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న గీతారెడ్డి… భూమి ఉన్న కౌలు రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రూ.15వేల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణిపోర్టల్ ను వ్యవస్థని పూర్తిగా ఎత్తివేస్తామని ఆమె అన్నారు.