TPCC Mahesh Goud : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ధర్నాలో పాల్గొనే కార్యకర్తలను రైల్వే స్టేషన్‌కు చేర్చే బాధ్యత ఆయా జిల్లా డీసీసీ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆగస్టు 5న పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగేలా వాయిదా తీర్మానం కోసం కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని గౌడ్ వెల్లడించారు.
Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
ధర్నా అనంతరం ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ ఉద్యమంలో రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునేందుకు టీపీసీసీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరనుందని, 7న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. కార్యకర్తలు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఈ ఉద్యమానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా హాజరవుతున్నారు. వీరు కూడా చర్లపల్లి నుంచి నాగపూర్ వరకు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైల్లోనే ప్రయాణించనున్నారు.