వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది.. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 60 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో 12 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో.. అక్కడి నుంచి ఎంజీఎం కు తరలించారు. అయితే, వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.. హాస్టల్ వార్డెన్ జ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. వంట మనిషి వెంకట్‌రావుపై కూడా చర్యలు తీసుకున్నారు.. ఘటనపై సమగ్ర విచారణ కు ఆదేశించారు..
అయితే, సస్పెన్షన్‌కు గురైన వార్డెన్ జ్యోతి వెళ్లిపోతుంటే.. విద్యార్థులు ఆమెను అడ్డుకోవడం.. బోరున విలపించడం.. అందరినీ కదిలించింది.. మీరు లేని ఈ హాస్టల్ మాకొద్దు మేడం అంటూ ఆమెను చుట్టుముట్టి కన్నీరు మున్నీరయ్యారు విద్యార్థినులు.. ఓవైపు విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటుంటే.. వారి ఆవేదన చూసి ఆ వార్డెన్ కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఫుడ్‌పాయిజన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.. వార్డెన్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. ఆమె హాస్టల్‌ను విడిచి ఇంటికి బయల్దేరి వెళ్తుండగా.. విషయం తెలుసుకున్న విద్యార్థినులు.. ఆమెను చుట్టుముట్టారు.. మేడంను సస్పెండ్ చేయొద్దంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అయితే, విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వార్డెన్ జ్యోతి.. తాను ఇక్కడే ఉంటానని.. మళ్లీ వస్తానంటూ సముదాయించి వెళ్లిపోయారు.