తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11:30 లకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యులు చేశారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో.. ప్రభుత్వాలది, చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని.. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని చెప్పారు. అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం కెసిఆర్ తెలిపారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సామాజికంగా, ఆర్థికంగా పీడింపబడుతున్నది దళితులేనని… ఈ బాధ పోవాలని పేర్కొన్నారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగి పోవాలంటే, ఏం చేయాలో, దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా వుందని అఖిల పక్ష సమావేశంలో సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. “మేము కూడా పురోగమించ గలం” అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో సూచనలు చేయాలని ప్రతిపక్ష పార్టీ నేతలను అడిగారు సీఎం కెసిఆర్.