CM KCR: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కొండగట్టుకు చేరుకొంటారని వెల్లడించారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారని వివరించారు. కాగా.. జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారుల, ప్రజాప్రతినిధులతో సీఎం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..
పర్యటన షెడ్యూల్..
* ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* అక్కడి నుంచి 9.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని జేఎన్‌టీయూ చేరుకుంటారు.
* అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. ప్రధాన దేవాలయం, అనుబంధ ఆలయాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి జేఎన్‌టీయూకు బయలుదేరి అక్కడి సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
* మధ్యాహ్నం ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు.
* అక్కడి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకొంటారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ డిజైన్ల రూపకర్త, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు స్థలాన్ని పరిశీలించారు. గుట్ట అభివృద్ధికి నమూనా రూపొందించిన సంగతి తెలిసిందే. యాదగిరిగుట్టలో 3 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉండగా, కొండగట్టులో 12 ఎకరాల భూమి ఉంది. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తు ప్రకారం గుట్టకు ఈశాన్యం వైపు నుంచి రోడ్డు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కొత్త రోడ్డు నిర్మాణం సాధ్యం కాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును ఈశాన్య దిశగా మళ్లించాలని సూచించినట్లు సమాచారం. గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్వామివారి ఆలయ విస్తరణ, దానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు కృష్ణ శిలతో చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
New Zealand: న్యూజిలాండ్‌లో భీకర తుఫాను.. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం