ఉన్న భూమిలో సగం ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట తీసుకొని నష్టపరిహారం చెల్లించకుండా తిప్పుకోవడం.. ఎప్పటికో నష్టపరిహారం వచ్చింద కదా అనుకుంటుంటే.. మళ్లీ మిగిలిన భూమిని కూడా ప్రభుత్వాలు తీసుకునేందుకు అడుగులు వేయడంతో రైతుల కుటుంబాలు భరించలేక ఆత్మహత్యలు చేసుంటున్నారు. మరికొందరు భూమి పోతుందన్న బాధను దిగమింగలేక గుండెఆగి చనిపోతున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామగుడు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో అదనపు కాలువ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ కాలువ అవసరం లేదని అక్కడి రైతులు, ప్రజలు నిరసనకు దిగారు.
అయినప్పటికీ ప్రభుత్వ తన నిర్ణయం మార్చుకోలేదు. దీంతో రాధమ్మ అనే మహిళ రైతు పొలంలోనే కుప్పకూలి మరణించింది. అదనపు కాలువలో పూర్తి భూమిని రాధమ్మ కుటుంబం కోల్పోతోంది. గతంలో వరద కాలువలో భూమిని కోల్పోయి, మరోసారి భూమి కోల్పోవలసి రావటంతో ఆవేదనతో రాదమ్మ మృతి చెందినట్లు కుంటుంబీకులు వెల్లడించారు. పొలం దగ్గర తిరుగుతూ పొలంలోనే రాధమ్మ పడిపోయింది. ఇదే గ్రామంలో 15 రోజుల క్రితం రైతు రాఘవ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.