Adilabad: రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది. దీనివో భాగంగానే రేపు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌కు మంత్రివర్గ ఉపసంఘం వెళ్లనుంది. రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ , వర్క్ షాప్‌కు రైతు భరోసా కమిటీ సభ్యులైన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కలు గురువారం ఉట్నూర్ కేబీ కంప్లెక్‌కు రానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ హాల్‌లను స్థానిక శాసన సభ్యులు వెడ్మా బొజ్జుతో కలసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.
Read Also: TSPSC : తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షలో మెట్‌పల్లి మహిళకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్
కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు.
ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్‌లో పాల్గొనడం జరుగుతుందని, రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారని పేర్కొన్నారు.
శాసన సభ్యులు వెడ్మా బొజ్జు మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గ ఉపసంఘం గురువారం రానున్నందున అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డీఎస్పీ నాగేందర్, ఆర్డీవో జీవాకార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.