మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీల్లో చేరికలు భారీగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్…. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ కండువా కప్పుకుంటారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బూర నర్సయ్య గౌడ్ చేరిక నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు బీజేపీ నేతలు బండి సంజయ్, డికె అరుణ, ఈటల రాజేందర్. ఇప్పటికే ఢిల్లీలోనే వున్నారు ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
బూర నర్సయ్య గౌడ్ తో పాటు మరికొందరు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు తో పాటు మరో ఇద్దరు కీలక నేతలు బీజేపీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం వల్ల ఆపార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
Read Also: NASA: విశ్వంలో శక్తివంతమైన పేలుళ్లు.. గుర్తించిన నాసా
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తనను పార్టీ సంప్రదించలేదని బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తితో వున్నారు. టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు బూర నర్సయ్యగౌడ్. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్ వివరించారు. బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కూడా మరోసారి కలువనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే.. బూర నర్సయ్యకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయన పార్టీని వీడడం వల్ల టీఆర్ఎస్ కి వచ్చిన నష్టం లేదంటున్నారు గులాబీ నేతలు.