NASA Detects Most Powerful Gamma-Ray Bursts Close To Earth: విశ్వంలో అత్యంత శక్తివంతమైన పేలుళ్లను గుర్తించింది నాసా. అధిక శక్తితో కూడిన రేడియేషన్ అక్టోబర్ 9న భూమిని దాటినట్లు నాసా వెల్లడించింది. గామా-రే బర్స్ట్(జీఆర్బీ)గా పిలిచే ఈ పేలుళ్లు అత్యంత శక్తితో కూడుకుని ఉంటాయి. వీటిని ఫెర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్, నీల్ గ్రెహెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ, విండ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా జీఆర్బీ లను గుర్తించినట్లు నాసా వెల్లడించింది. ఈ గామా – రే బర్ట్స్ కు జీఆర్బీ 221009ఏగా నామకరణం చేసింది. భూమికి సమీపంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు నాసా గుర్తించింది.
ఈ పేలుడు సగిట్టా రాశి నుంచి వచ్చినట్లు తేల్చారు శాస్త్రవేత్తలు. భూమిని ఇది చేరేందుకు 1.9 బిలియన్ ఏళ్లు ప్రయాణించినట్లు నాసా తెలిపింది. ఇంత ప్రకాశవంతమైన జీఆర్బీ మరికొన్ని దశాబ్ధాలు కనిపించకపోవచ్చని నాసా అభిప్రాయపడింది. నాసా తెలిపిన దాని ప్రకారం ఫెర్మీ టెలిస్కోప్ దాదాపుగా 10 గంటలకు పైగా పేలుడును గుర్తించింది.
Read Also: Sunflower Oil: రష్యా చర్యతో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం.. భారత్‌పై ప్రభావం
నక్షత్రం తన జీవిత చరమాంకంలో పేలిపోతూ.. బ్లాక్ హోల్ ఏర్పడే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నక్షత్రం తన కేంద్రంలో కుప్పకూలిపోతున్న సమయంలో దాని కేంద్రం నుంచి ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగానే శక్తివంతమైన గామా-రే బర్ట్స్ ఏర్పడినట్లు నాసా వెల్లడించింది.
సూర్యుడితో పాటు ఏ నక్షత్రమైన కొన్ని బిలియన్ ఏళ్ల తరువాత చనిపోవాల్సిందే. నక్షత్రాల్లో ఉండే ఇంధనం అయిపోయే సమయంలో నక్షత్రాలు వైట్ మరగుజ్జు నక్షత్రాలుగానో, బ్లాక్ హోల్స్ గానో మారుతాయి. నక్షత్రం తన చివరి కాలంలో సూపర్ జెయింట్ గా ఏర్పడి, ఆ తరువాత ఒక్కసారిగా దాని కేంద్రంలో కుప్పకూలిపోతుంది. ఈ సమయంలోనే శక్తివంతైన పేలుళ్లు సంభవిస్తాయి. సూర్యుడు లాంటి చిన్న నక్షత్రాలు కేవలం తెల్లని మరగుజ్జు నక్షత్రాలుగా ఏర్పడుతాయి. అయితే సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవిగా ఉండే నక్షత్రాలు మాత్రం బ్లాక్ హోల్స్ గా మారుతుంటాయి.