BJP Should Win To Achieve Development In Telangana Says Parshottam Rupala: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పైన విముఖత ఉందని తాను విన్నానని.. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసిందని అన్నారు. 2014 ముందు ఈ దేశంలో అవినీతి మాత్రమే ఉండేదని.. కానీ 2014 నుండి ఈ 9 సంవత్సరాల్లో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పశువుల గురించి అనేక పధకాలు ప్రవేశపెట్టారని.. పశువుల కోసం అంబులెన్స్ ప్రవేశపెట్టిన ఘనత మోడీకే దక్కిందని చెప్పారు. దేశంలో మోడీ 4000 అంబులెన్స్‌లు మంజూరు చేశారని.. అంబులెన్స్‌తో పాటు డాక్టర్, సిబ్బంది అందరికీ కేంద్రం 60 శాతం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు.
Bandi Sanjay: బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటి కాదు.. బిఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే!
కరోనా కాలంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదేనని కేంద్రమంత్రి పురుషోత్తం అన్నారు. 200 కోట్ల వ్యాక్సిన్‌లను అందరికి అందించారన్నారు. రైతులకు ప్రధాని మోడీ రూ.18 లక్షల కోట్ల రుణాలను ఇస్తున్నారని.. మత్స్య శాఖ వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఈరోజు కాశ్మీర్‌లో ఒక్క కర్ఫ్యూ లేకుండా, ప్రశాంతంగా ఉందన్నారు. ఈ దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు సైతం కట్టించారన్నారు. మోడీ రాకముందే దేశంలో 100 డ్యామ్‌ల నిర్మాణం ఆగిపోయి ఉండేవని.. మోడీ వచ్చాక రూ.50 లక్షల కోట్ల నిధులతో 100లో 60 డ్యామ్‌ల పని పూర్తి అయ్యిందని తెలిపారు. ఉత్తర వాహిని గోదావరి గుజరాత్‌లో ఉందని, చెన్నూర్‌లో ఉత్తరా వాహిని గోదావరి ఉందని.. ఈ నది అభివృద్ధికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు. ప్రధాని చేసిన అభివృద్ధిని ప్రజలకు తప్పక వివరించాలని సూచించారు.
CM KCR: ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి.. వారిని స్మరించుకునేందుకే అమరజ్యోతి
కరోనా కాలంలో అందరూ అల్లాడిపోతుంటే.. మోడీ లాక్‌డౌన్ విధించి, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని పురుషోత్తం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 20 వేల మంది విద్యార్థులను దేశానికి రప్పించిన ఘనత మోడీదని అన్నారు. చైనా కూడా మన దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే, మోడీ దాన్ని ధైర్యంగా ఎదుర్కున్నారన్నారు. జీ20 సదస్సులో అధ్యక్షత వహించిన ఘనత మోడీకి దక్కిందని కొనియాడారు. సమర్ధవంతమైన మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని పురుషోత్తం చెప్పుకొచ్చారు.