బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 10 రోజులు పర్యటించనున్నారు. రోజుకు 8 నుంచి 10 గ్రామాల్లో బైక్ ర్యాలీలు తీయనున్నారు. మొత్తం 4 విడతల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది బీజేపీ.
ఇదిలా ఉంటే ఆగస్ట్ 2 లేదా 3 నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. రెండో విడత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హజరయ్యారు.
Read Also: Andhra Pradesh: ఎల్లుండి సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్న ద్రౌపది ముర్ము
మరోవైపు రేపు ( సోమవారం ) బండి సంజయ్ ‘మౌనదీక్ష’ చేపట్టనున్నారు. రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రేపు (సోమవారం) ‘మౌనదీక్ష’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా కేంద్రం వరలక్ష్మీ గార్డెన్స్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరగనున్న మౌనదీక్షలో బండి సంజయ్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనదీక్షలకు సంఘీభావం తెలపాలని పార్టీ సూచించింది.