అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో బీజేపీ ఆహ్వానించిన స్పీకర్.. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించడం లేదని అడిగితే.. ఆయన వద్దే సరైన సమాధానం లేదన్నారు. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఏసీకి ఆహ్వానించవద్దని ఎక్కడ నిబంధన ఉందో చెప్పాలని… ఐదుగురు సభ్యులు ఉంటేనే బీఏసీ ఆహ్వానించాలనే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు.
ఇక, బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి పిలవకపోవడంపై సోమవారము నిరసన తెలియజేస్తామని ప్రకటించారు రఘునందన్‌రావు.. సోమవారం రోజు ఉదయం 9 గంటల నుండి పది గంటల వరకు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తాం అన్నారు. మరోవైపు.. గతంలో అమలు పరిచిన విధానాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించిన ఆయన.. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని… అతి ఉత్సహంతో, కొత్త విధానాలు అమలు చేస్తే భవిష్యత్తులో టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఇక, సీఎల్పీని టీఆరెస్‌లో విలీనం చేసుకున్నప్పుడు భట్టి విక్రమార్కను బీఏసీకి ఎలా ఆహ్వానిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్.. కాంగ్రెస్ , టీఆర్‌ఎస్ ఒక్కటే అని ఇప్పటి కైనా బట్టబయలు అయ్యిందని విమర్శించారు.. అసలు కాంగ్రెస్ విలీనం అయ్యింది. మిగిలిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు బీటీమ్‌గా మారిందని ఆరోపించారు. కాగా, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం షెడ్యూల్ చేసింది.