హుజురాబాద్ ఎన్నికల్లో పోలీసులు వన్‌సైడ్‌గా చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత జి. వివేక్.. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.. వరంగల్‌లోని గాయత్రి గ్రాండ్ హోటల్‌లో మీడియా సమావేశానికి వచ్చిన హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసులకు నచ్చజెప్పి హోటల్‌కు వెళ్లారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మంత్రులు ప్రెస్ మీట్ పెడితే అడ్డుకోని పోలీసులు.. బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు.. డబ్బుల పంపిణీ జరుగుతున్న తీరును అడ్డుకోని పోలీసు.. బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, పోలీసులు వన్ సైడ్ చేస్తున్నారు.. ఇది సరైంది కాదని హితవుపలికిన వివేక్.. డబ్బులు పంపిణీ చేసేవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఈటల రాజేందర్‌పై స్థానికుల్లో సానుభూతి ఉందన్నారు వివేక్.. ఆయన పై చేసిన కుట్రలను హుజురాబాద్ ప్రజలు చూశారన్నారు.