ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ఇప్పుడే ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకున్నా.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజక వర్గానికి సంబంధం లేకుండా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం మొదలు పెట్టారన్న ఆయన.. నా లాంటి వాళ్ళను గుర్తించి ఓటేయ్యాలనుకునే వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.. ఒక ఇంట్లో 30 నుంచి 40 ఓట్లు నమోదు చేసి దొంగ పనులకు ఒడిగట్టుతున్నారని ఆరోపించిన ఆయన.. చట్టబద్ధమైన చర్యలకోసం పోరాడుతామన్నారు.. ఓటు తొలగించకుండా కంటికి రెప్పల మీ ఓటు కాపాడుకోండి అంటూ హుజురాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఈటల.. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే చట్ట పరంగా శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు.. ఇక, ఉద్యమకారుల రక్తాన్ని చూసినవారు.. కేసీఆర్ ను తిట్టినవారు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నారంటూ ఎద్దేవా చేశారు..